జూబ్లీ ట్రైలర్ చూశారా? అందులో అదితిరావు హైదరీ, అపర్‌శక్తి ఖురానా పెర్ఫార్మెన్స్ లు గమనించారా? ఇండియన్ సినిమా గోల్డెన్ ఎరాలోకి వెళ్లిన అనుభూతి కలిగిందా? ఇప్పుడు ముంబై వీధుల్లో ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటున్న మాటలివి. విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ జూబ్లీ. అదితిరావు హైదరీ, అపర్‌శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు. సౌమిక్ సేన్, విక్రమాదిత్య మోత్వానీ క్రియేట్ చేశారు. ఈ ఏడాది బాలీవుడ్ జనాలు ఈగర్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూబ్లీ కూడా ఒకటి.
ఆందోళన్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్‌మెంట్, ఫాంటమ్ స్టూడియోస్ కలిసి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ఇది. ప్రసోన్‌జిత్ చటర్జీ, వామికా గబ్బి, సిద్ధాంత్ గుప్త, నందీష్ సాంధు, రామ్ కపూర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ కథను 1947లో మొదలుపెట్టారు. అప్పటి బాంబేని చూపించారు. సూపర్‌స్టార్ మదన్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఇది. సుమిత్ర కుమారితో ఆయనకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తుంది. ట్రైలర్‌లో నటీనటులందరూ సరికొత్తగా కనిపిస్తున్నారు. జూబ్లీ పార్ట్ ఒన్‌లో ఐదు ఎపిసోడ్‌లున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రీమియర్ కానుంది. ఏప్రిల్ 14న మిగిలిన ఐదు ఎపిసోడ్లు విడుదల కానున్నాయి.
దర్శకుడు మాట్లాడుతూ ``నేను అసిస్టెంట్ డైరక్టర్‌గా ఉన్నప్పటి నుంచీ నన్ను ఊరిస్తున్న సబ్జెక్ట్ ఇది. సినిమాను అందరూ నెత్తిన పెట్టుకున్న రోజులకు సంబంధించిన ఇన్‌పుట్స్ తో తెరకెక్కించాను. ఈ సీరీస్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. నటీనటుల ఆహార్యం, మాట తీరు, అప్పటి యాంబియన్స్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నాకు చాలా మంచి నటీనటులు దొరికారు. ఆ విషయంలో నా పని సులభమైంది. ఈ సీరీస్ చూసి జనాలు ఎలా స్పందిస్తారో చూడాలని ఉంది. రియల్ లైఫ్ లవ్ స్టోరీలకు మన దగ్గర ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఈ సీరీస్ విషయంలో వర్కవుట్ అవుతుందనే నమ్మకం ఉంది`` అని అన్నారు.